ఇక అడవుల్లోనూ ఎన్‌ఎస్‌జీ ఆపరేషన్లు

download (3)కమాండోలకు ‘బందీల విడుదల’లో శిక్షణ

న్యూఢిల్లీ: ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లు, వీవీఐపీలకు భద్రత వంటి పట్టణప్రాంత కార్యకలాపాలకే పరిమితమైన జాతీయ భద్రతా దళం(ఎన్‌ఎస్‌జీ) ఇక దట్టమైన అడవుల్లోనూ సత్తా చాటనుంది! ఉన్నతస్థాయి నేతలను, అధికారులను నక్సల్ కిడ్నాప్ చేస్తుండడం పెరిగిపోతున్న నేపథ్యంలో అలాంటి బందీల విడుదలపై దృష్టి సారించింది. దీనికోసం అడవుల్లో కచ్చితత్వంతో కూడిన ఆపరేషన్లను ఎలా చేపట్టాలన్నదానిపై తన బ్లాక్ క్యాట్ కమాండోల్లోని ఒక బృందానికి శిక్షణ ఇస్తోంది. ఎన్‌ఎస్‌జీ 30 ఏళ్ల చరిత్రలో ఇలాంటి శిక్షణ ఇదే తొలిసారి. గత ఏడాది ఛత్తీస్‌గఢ్‌లోని దర్భాఘాట్‌లో రాజకీయ నేతలను నక్సల్స్ హతమార్చడం, మల్కనగిరి(ఒడిశా), సుక్మా(ఛత్తీస్) కలెక్టర్లను అపహరించడం తెలిసిందే.

ఈ నేపథ్యంలో నక్సల్స్‌కు చెక్ పెట్టేందుకు ఎన్‌ఎస్‌జీ ఓ ప్రత్యేక దళాన్ని సిద్ధం చేస్తోందని వ్యూహాత్మక భద్రతా నిపుణులు చెప్పారు. దీని కోసం ఎన్‌ఎస్‌జీ డెరైక్టర్ జనరల్ జేఎన్ చౌధురి ఓ బ్లూప్రింట్ సిద్ధం చేశారని, దానికి అనుగుణంగా ప్రస్తుతం కమాండోలకు శిక్షణ ఇస్తున్నారని వెల్లడించారు. హెలికాప్టర్ల ద్వారా అడవుల్లోకి చేరుకోవడం, పారాచ్యూట్‌ల నుంచి నిశ్శబ్దంగా దిగడం, నిఘా సమాచారంతో రహస్యంగా నక్సల్స్ శిబిరాలకు చేరుకోవడం ఈ శిక్షణలో ఉన్నాయి. ముంబై ఉగ్రవాద దాడుల తర్వాత దేశంలో నాలుగు చోట్ల నెలకొల్పిన ఎన్‌ఎస్‌జీ హబ్‌లను ఈ కమాండోలు వాడుకోవచ్చని బ్లూప్రింట్‌లో ఉంది. వామపక్ష తీవ్రవాదులను ఉగ్రవాదులుగా కేంద్ర ప్రభుత్వంలో చాలా ఏళ్లకిందటే ప్రకటించిన నేపథ్యంలో ‘టార్గెట్ జంగిల్’ శిక్షణ మొదలైంది.

Leave a Comment