తాజ్‌మహల్… తెర వెనుక కథ..!

TajMahalప్రేమకు చిహ్నమా? చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా కట్టినదా?
 ప్రపంచ వింతల్లో తాజ్‌మహల్‌కు స్థానం కల్పించారు.
 17 వ శతాబ్దానికి చెందిన తాజ్‌మహల్‌ను మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య మీద ఉన్న ప్రేమకు చిహ్నంగా కట్టించాడు.
 ముంతాజ్… పుత్రుడికి జన్మనిస్తూ మరణించింది…
 ఇదంతా షాజహాన్, ముంతాజ్‌ల చరిత్ర.
 1970లో దిలీప్ హైరో అనే రచయిత ఇంగ్లిషులో ‘టేల్ ఆఫ్ ద తాజ్’ అనే నాటకాన్ని రచించారు. ఇటీవలే భారతదేశంలో ‘షా జహాన్ – ఓ – ముంతాజ్’ అనే పేరున ఉర్దూలో మొట్టమొదటిసారిగా ప్రదర్శితమైంది. ‘తాజ్‌మహల్ ప్రేమ చిహ్నమని తెలుసు. పాపానికి ప్రాయశ్చిత్తం అనే విషయం తెలియదు’ అనే కొత్త కోణంలో ఈ నాటకం సాగుతుంది.
 షాజహాన్‌కి ముంతాజ్ మూడవ భార్య. అంతేనా ఆయన గారాలపట్టి కూడా. ఆమె చాలా అందంగా ఉంటుందనీ, భర్తకు ఎన్నో సేవలు చేసేదనీ ప్రసిద్ధి. అలాగే ఆమెకు అధిక సంతానం కలిగిందనీ, 14 వ సంతానానికి జన్మనిచ్చే సమయంలో మరణించిందనీ చరిత్ర చెబుతోంది. వారి ప్రేమకథ అమరం. ఇది అందరికీ తెలిసిన కథ.
 అంత అందమైన ముంతాజ్‌లో మరో కోణం ఉంది. ‘‘ఆమె చదరంగం బాగా ఆడేది. అది కూడా షాజహాన్ కంటె కూడా బాగా ఆడేది. వీటికి తోడు ఆమెకు అత్యాశ’’ అని ఈ నాటకం చెబుతోంది.
 17 వ శతాబ్దాన్ని ప్రతిబింబిస్తుంది ఈ నాటకం. మొఘలుల కాలంలో… ఆధిపత్యం కోసం అనేక నీచ రాజకీ యాలు నడిచేవనీ, రాణులు రాజకీయంగా ప్రాధాన్యత కలిగి ఉండేవారనీ చరిత్రకారులు చెబుతున్నారు. ముంతాజ్ రాజకీయాలను మలుపు తిప్పిందనీ, అనేక చారిత్రక నిర్ణయాలలో ఆవిడ ప్రాధాన్యత ఉండేదనీ, ప్రభుత్వ ఉత్తర్వుల విషయంలో కూడా ఆమెకు ప్రాధాన్యత ఉండేదనీ తెలుస్తోంది.
 సింహాసనం కోసం షాజహాన్, అతడి సోదరుడు పర్వేజ్ మధ్య తీవ్రమైన శత్రుత్వం నడిచిందనీ, ముంతాజ్ ఈ విషయంలో కుట్ర పన్ని, పర్వేజ్‌కు విషమిచ్చి చంపి, పరోక్షంగా భర్త విజయానికి కారణం అయిందని ఈ నాటకం చెబుతోంది.
 ఇంకా… ఈ నాటకంలో ముంతాజ్‌లోని వివిధ కోణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అంకితభావం కలిగిన భార్యగా, భర్తకు మార్గదర్శకురాలిగా, సలహాదారుగా ఉన్నప్పటికీ, ఆమెలో స్వార్థం ఉందని తెలుస్తోంది.
 ఈ నాటకంలో ఒక విశేషం ఉంది… షాజహాన్‌తో ముంతాజ్ చదరంగం ఆడటానికి కూర్చుంటుంది. ఆ సమయంలో ఆమె గర్భవతి. ఆటను కేవలం ఆటగా కాకుండా పందెం వే సి ఆడదామంటుంది ముంతాజ్.  పందెం ప్రకారం… ఆటలో భర్త ఓడిపోతే తాను సింహాసనం మీద కూర్చోవాలి. ఇదంతా ఆమెలోని ఆమెలోని పదవీకాంక్షను తెలియచేస్తుంది.  షాజహాన్ చక్రవర్తి ముంతాజ్ అంతరంగాన్ని అర్థం చేసుకుంటాడు. ఎలాగైనా ముంతాజ్ దురాలోచనకు అడ్డుకట్ట వేయాలనుకుంటాడు. రాజముద్ర కోసం వారిద్దరి మధ్య జరిగిన పెనుగులాటలో ముంతాజ్ సింహాసనం మీద నుంచి కిందకు పడిపోతుంది. కొంతకాలానికి ప్రసవ సమయంలో మరణిస్తుంది… ఇది ఆ నాటకంలోని కొత్త సన్నివేశం.
 ‘‘ఈ నాటకం… షాజహాన్‌లోని ప్రేమికుడి కంటె ముంతాజ్‌లోని రాజకీయవేత్తను ఆవిష్కరిస్తుంది. ఇదొక మంచి ఆలోచన’’ అని పలువురు పత్రికా సంపాదకులు ఈ నాటకాన్ని ప్రశంసించారు.
 ఈ నాటకంలోని కథ పూర్తిగా కల్పన. ముంతాజ్‌ను హత్య చేసినట్లు చరిత్రలో ఎక్కడా లేదు.
 నాటకాన్ని రక్తి క ట్టించడం కోసం వాస్తవ కథకు కొంత కాల్పనికత జోడించి, తయారుచేసినట్లు హైరో చెప్పారు.
 – డా. వైజయంతి

Leave a Comment