దేశచరిత్రలో ఇలాంటి విభజన జరుగలేదు : శివరామకృష్ణన్‌

51406382483_625x300హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వంటి విభజన దేశ చరిత్రలో జరుగలేదని ఏపిలో రాజధాని నిర్మించే ప్రాంతాన్ని సూచించడానికి కేంద్రం నియమించిన కమిటీ చైర్మన్ శివరామకృష్ణన్‌ చెప్పారు. ఆగస్టు మధ్యలో ఏపి రాజధానిపై కేంద్రానికి తుది నివేదిక ఇస్తామన్నారు.  ఫలానా చోటే రాజధాని ఉండాలని తాము శాశించం అని అన్నారు. కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసిన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధాని ఎక్కడా అనేది నిర్ణయించేది ఏపీ ప్రభుత్వమేనన్నారు. నీరు, అన్ని రకాల రవాణా సదుపాయాలు ఉన్నచోటే నూతన రాజధానికి అనుకూలం అని చెప్పారు.

రాష్ట్రంలో జలవనరుల పరిస్థితిపై చంద్రబాబుతో చర్చించినట్లు తెలిపారు. రాయలసీమలో సగటు వర్షం పాతంకూడా పడని అంశాన్ని చంద్రబాబుకు వివరించినట్లు చెప్పారు. రాష్ట్రంలో పెట్టాల్సిన సంస్థలను అన్ని ప్రాంతాలకు విస్తరింపచేజే అంశంపై చర్చినట్లు వివరించారు. పరిపాలనా కేంద్రాలు ఒకే చోట ఉండాలన్నది ప్రభుత్వం ఆలోచనగా చెప్పారు. కాని రాష్ట్రంలో అన్నిచోట్లా భూ లభ్యత అంత సులభంగా లేదన్నారు. ఒకటిరెండు ప్రాంతాల్లో మాత్రమే భూ లభ్యత ఉందని చెప్పారు.

ఏ ప్రాంతమూ రాజధానికి పూర్తిస్థాయిలో అనుకూలత ఉందని చెప్పలేం అన్నారు. కాని కొన్ని ప్రాంతాలకు ఒకటిరెండు అంశాల్లో సానుకూలతలు ఉన్నాయని తెలిపారు. ఒకే ప్రాంతంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉండడం సాధ్యం కాదన్నది తమ అభిప్రాయంగా చెప్పారు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా సమగ్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకోవాలన్నది తమ అభిప్రాయంగా తెలిపారు. వైజాగ్‌, తిరుపతి, రాయలసీమ, మధ్యాంధ్ర ప్రాంతాల్లో నగరాలను విస్తరించుకోవాలన్నది తమ అభిప్రాయంగా వివరించారు. కాని చాలా అంశాల్లో ఆర్థిక సంక్లిష్టతలు ఉన్నాయన్నారు.

ఒక ప్రాంతంలోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలన్నది తమ అభిప్రాయంగా తెలిపారు. మాకు తగిన సమయం ఉన్నా ఆగస్టు మధ్యంతరంలోగా రాజధానిపై నివేదిక ఇస్తామని చెప్పారు. తాము రాజధానికి అవకాశాలున్న ప్రాంతాలు, పరిష్కారాలు, ఇతరత్రా అవకాశాలను వివరిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల ఆకాంక్షలు, అభిప్రాయాలను చెప్పినట్లు తెలిపారు. రాజధానిపై అనేక కోరికలు ఉండొచ్చునని, కాని భూముల లభ్యతకూడా ఉండాలి కదా? అని శివరామకృష్ణన్‌ ప్రశ్నించారు.

13 నుంచి 14 ప్రాంతాలను గుర్తించామని ఆయన చెప్పారు. హైదరాబాద్‌లో మొత్తం 192 ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయని తెలిపారు. నీరులేని చోట మత్స్యశాఖ కార్యాలయాలను పెట్టలేం కదా? ఈ కార్యాలయాలను ఎక్కడ పెట్టాలి? ఏ ప్రాంతానికి తరలించాలన్నదానిపై దృష్టిపెట్టవలసిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 89 సంస్థలను ఎక్కడకు తరలించాలన్న విషయం ఆలోచించాలన్నారు.  ఒకేచోట అన్నిఆఫీసులను ఉంచొద్దని చెప్పినట్లు  శివరామకృష్ణన్‌ తెలిపారు. ఇలాంటి విభజన దేశచరిత్రలో ఎప్పుడూ లేదన్నారు.

శ్రీకాళహస్తి – నడికుడి పూర్తయితే అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు. ప్రతిఏటా రెండు నుంచి మూడు లక్షలు ఉద్యోగాలు కల్పించవలసి ఉందని, అయితే ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదని, పరిశ్రమలే ఉద్యోగాలు ఇస్తాయని తెలిపారు. రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉండాలనడంలో ఎలాంటి వివాదం లేదని చెప్పారు. అతిపెద్ద నగరం అన్నింటికీ పరిష్కారాలు చూపలేదన్నారు. రాజధాని అనేది ప్రధాన నగరాలకు అనుబంధంగా నిర్మించిందేనని చెప్పారు. రాజధాని అంటే పెద్దపెద్ద భవనాలు అనే భావన వదిలేయాలన్నారు. భువనేశ్వర్‌ రాజధానులకు సరైన ఉదాహరణ అని చెప్పారు. వ్యవస్థలు నడవడానికి అనువైన వాతావరణం ఉండాలన్నారు.

విజయవాడకు తాము వ్యతిరేకం కాదని, అయితే  సర్వీసుల విషయంలో ఇబ్బందులు ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రజలు ఎక్కువుగా వస్తే అక్కడ సేవలు అందవన్నారు. రాజధాని ప్రాంతాన్ని గుర్తించడం అంత సులభంకాదని చెప్పారు. రాజధానిలో కేవలం 50 ప్రభుత్వ కార్యాలయాలు ఉంటే సరిపోతుందన్నారు. పర్యావరణం, నీరు, భూమి ఆధారంగా కొన్ని ఆప్షన్స్‌ ఇచ్చామని తెలిపారు. భూముల ధరలు విపరీతంగా ఉన్నాయని, భూముల కొనుగోలు కోసం విపరీతంగా ఖర్చుపెట్టొద్దని చెప్పామన్నారు.

Leave a Comment