ఈ టైటిల్ తెలంగాణకు అంకితం

imagesన్యూఢిల్లీ: తాను గెలిచిన యుఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను తెలంగాణ ప్రజానీకానికి అంకితమిస్తున్నట్లు రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా పేర్కొంది. ”బ్రూనోతో కలిసి గొప్ప విజయం సాధించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నా. మేం తొలిసారి కలిసి ఆడాం. రెండు వారాలు అద్భుతంగా గడిచాయి. ఈ విజయాన్ని నా దేశ ప్రజలకు.. ముఖ్యంగా తెలంగాణకు, రాష్ట్ర ప్రజానీకానికి అంకితమిస్తున్నా” అని చెప్పింది. యుఎస్ ఓపెన్ టైటిల్ తనకు ఎంతో ప్రత్యేకమని మీర్జా తెలిపింది. ”నా ఆనందానికి హద్దుల్లేవు. కల నిజమైంది. భవిష్యత్తులో మరిన్ని టైటిళ్లు సాధిస్తాననుకుంటున్నా. ఏదో ఒకరోజు కెరీర్ స్లామ్ పూర్తి చేయాలన్నది నా లక్ష్యం”అని చెప్పింది. టైబ్రేక్‌లో 9-4 ఆధిక్యంలో ఉన్న తర్వాత.. 9-9తో స్కోరు సమమైనపుడు ఒత్తిడికి గురయ్యారా అని అడిగితే.. ”ఉత్కంఠకు గురైన మాట వాస్తవం. ఐతే ఎలాంటి స్థితిలోనైనా సానుకూలంగా ఉండటం ముఖ్యం. ఏం జరిగినా ఒకరికొకరు సహకరించుకుని, పైచేయి సాధించాలనుకున్నాం” అని సానియా చెప్పింది. గత నెల తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా సానియాను నియమించడంపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. యుఎస్ ఓపెన్‌కు ముందు ఈ వివాదం ప్రభావం చూపిందా అని సానియాను అడగ్గా.. ”ప్రతికూల విషయాల గురించి ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు” అంది.
సానియా తెలంగాణకు గర్వకారణం: కేసీఆర్
సానియా మీర్జాపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. ”సానియా మూడు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన అరుదైన ఘనత సాధించినందుకు తెలంగాణ ప్రజలు ఆమెను చూసి గర్విస్తున్నారు” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

రాష్ట్రపతి అభినందనలు: సానియాకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా అభినందనలు తెలిపారు. ”శ్రమ, నిబద్ధతతో ఎంత గొప్ప విజయాలు సాధించవచ్చో నువ్వు నిరూపించావు. దేశాన్ని గర్వించేలా చేశావు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలి” అని సానియానుద్దేశించిన ప్రకటనలో రాష్ట్రపతి పేర్కొన్నారు.

Leave a Comment