ఆమెది అంత విషాద గాథనా?

download (1)ఆమెది అంత విషాద గాథనా అంటూ కంటతడి పెట్టారు త్రిష. ఈ చెన్నై చిన్న దాన్ని అంతగా బాధించిన నటి గాథ ఎవరిదో కాదు మహానటి సావిత్రిది. నటి త్రిష ప్రస్తుతం బాలకృష్ణకు జంటగా ఒక భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. షూటింగ్ విరామ సమయంలో త్రిషతో సీనియర్ నటుడు పిచ్చాపాటి మాట్లాడుతూ నటి సావిత్రి జీవితం గురించి చెప్పారట. తమిళం తెలుగు భాషల్లో ఎన్నో ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో అత్యుత్తమ నటన ప్రదర్శించి అగ్ర నటీమణిగా ప్రకాశించిన నటి శిరోమణి సావిత్రి.
 
 అప్పట్లోనే లక్షలు ఆర్జించి, ఆస్తులు పెంచుకున్నారు. అయితే చివరి దశలో అవన్నీ ఆమెకు దూరమయ్యాయి. అవకాశాలు లేక అనారోగ్యంతో కోమాలోకి వెళ్ళిపోయారు.  కోమాలోనే తుది శ్వాస విడిచారని ఆ నటుడు చెప్పడంతో త్రిష మనసు కకావికలమై కంటతడి పెట్టేశారట. ఈతరం కథానాయికలకు రోల్‌మోడల్‌గా ఉన్న సావిత్రి నిజ జీవిత కథ ఇంత శోకమా అంటూ బాధపడ్డారట. అవును ఆ మహానటి సాధన  ఇతర నాయికలకు ఆదర్శమే. ఆమె జీవితం కూడా గుణపాఠమే.