‘ఆపరేషన్ ఆకర్షణ్’ షురూ!

71406921583_625x300వలస నాయకులకు గులాబీ దళపతి ద్వారాలు తెరిచారు. ‘గ్రేటర్’లో పాగా వేసేందుకు ‘ఆపరేషన్ ఆకర్షణ్’కు తెర లేపారు. తమవైపు చూస్తున్న ఇతర పార్టీ నాయకులను ఆలస్యంగా చేయకుండా తమలో కలుపుకునేందుకు కారు పార్టీ అధినాయకుడు పచ్చజెండా ఊపారు. రాబోయే ‘గ్రేటర్’ ఎన్నికల్లోనూ గులాబీ జెండాను రెపరెపలాడించేందుకు వ్యూహాన్ని సిద్దం చేశారు.

నవంబర్ లో జరగనున్నగ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ సీనియర్ నేతలతో టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం చర్చలు జరిపారు. నగరంలో టీడీపీ-బీజేపీ కూటమిని దీటుగా ఎదుర్కొనేందుకు సమాయత్తమవ్వాలని నాయకులకు సూచించారు. ఇందుకోసం పార్టీశ్రేణులను సమాయత్తం చేయడంతోపాటు వివిధ పార్టీల ముఖ్యనేతలను, కార్పొరేటర్లను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవాలని ఆదేశించారు.

పాతనగరంలో బలంగా ఎంఐఎంతోనూ చేతులు కలిపేందుకు టీఆర్ఎస్ పావులు కదుపుతున్నట్టు కనబడుతోంది. ఈ బృహత్తర బాధ్యతలను పార్టీ సెక్రటరీ జనరల్, ఎంపీ కె.కేశవరావు, మంత్రి హరీష్రావులకు కేసీఆర్ అప్పగించారు. సీఎం పదవి చేపట్టిన నాటి నుంచి పాలనలో నిమగ్నమైన కేసీఆర్ ఇప్పుడు పార్టీ బలోపేతంపైనా దృష్టి సారించారు.

సార్వత్రిక ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో అనుకున్న ఫలితాలు రాకపోవడంతో కార్పొరేషన్ పోరులో సత్తా చాటాలని పట్టుదలతో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 24 అసెంబ్లీ స్థానాల్లో 14 సీట్లను టీడీపీ-బీజేపీ కూటమి దక్కించుకుంది. ఇక నాలుగు ఎంపీ సీట్లలో రెండింటినీ తన ఖాతాలో వేసుకుంది. ఈ ఫలితాలు ‘గ్రేటర్’లో టీఆర్ఎస్ బలపడాల్సిన ఆవశ్యకతను వెల్లడించాయి. దీంతో టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ గాలం వేసింది. ఇంకా పలువురు  ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని, వారి పేర్లు వెల్లడించనని డిప్యూటీ సీఎం మొహమూద్ అలీ చెప్పారు. టీఆర్ఎస్ ‘ఆపరేషన్ ఆకర్షణ్’ ఏ మేరకు వలస నాయకులను ఆకర్షింస్తుందో చూడాలి.

Leave a Comment