చర్చకు వేళాయె..!

download (2)నేడు గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ;హైదరాబాద్: రెండు రాష్ట్రాలు అధికారికంగా విడిపోయి రెండున్నర నెలలు..! రాష్ట్రాలు విడివిడిగా కుదురుకునే సంధి దశలో అనేకాంశాల్లో విభేదాలు, వివాదాలు సహజమే. కానీ ఉభయతారక పరిష్కారాల దిశలో కాకుండా రెండు ప్రభుత్వాలూ ఘర్షణ  వైఖరితో, తమ తమ వాదనలకే భీష్మిం చుకోవడంతో వివాదాలు ముదిరిపోతున్నాయి. రాష్ట్రాల స్థాయిలో పరిష్కరించుకోవాల్సిన అం శాల్లో తాను జోక్యం చేసుకోలేననీ, ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుని మాట్లాడుకోవడమే తక్షణ కర్తవ్యమని కేంద్రం కూడా గట్టిగా సూచి స్తున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు, ఏపీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఆదివారం మధ్యాహ్నం ఇరు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ సమక్షంలో రాజ్‌భవన్‌లో భేటీ కానున్నారు.
 
 గవర్నర్ స్వాతంత్య్ర దినోత్సవం రోజు ‘ఎట్ హోం’ సందర్భంగా ఇద్దరు సీఎంలతో ప్రత్యేకంగా సమావేశమై.. చర్చల దిశలో సయోధ్య కుదర్చడంతో ప్రస్తుత సీఎంల భేటీకి మార్గం సుగమమైంది. ఒకసారి సీఎంల స్థాయిలోనే సంప్రదింపులు ప్రారంభమైతే చాలా అంశాల్లో ఉన్నతాధికారుల స్థాయిలోనూ ఈ స్ఫూర్తి కొనసాగుతుందనేది ఈ భేటీ ఉద్దేశం. ఇరు రాష్ట్రాల శాసనమండలి చైర్మన్లు, శాసనసభ స్పీకర్లు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు, శాసనసభ కార్యదర్శులు, డీజీపీలతో పాటు.. ఆయా శాఖల ముఖ్య అధికారులు కూడా పాల్గొనే ఈ భేటీలో ప్రత్యేకించి కరెంటు, అసెంబ్లీ సమావేశాలు, ఉమ్మడి సంస్థలు, భవనాలు, చాంబర్ల కేటాయింపులపై చర్చ ఉంటుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. కానీ నిజానికి ఇప్పటికిప్పుడు ఇద్దరూ చర్చించుకోవాల్సిన అంశాలు మరిన్ని ఉన్నాయి. తమ తమ రాజకీయ లక్ష్యాలు, ప్రాధాన్యాల దిశలో కొన్ని కీలకాంశాల్లో ఇద్దరు సీఎంలు తమ వైఖరులను సడలించుకోలేకపోయినా అవి మరింతగా ముదిరిపోకుండా ఈ భేటీ ఉపకరిస్తుందనేది గవర్నర్ భావనగా తెలుస్తోంది.
 
 పవర్ వార్!
 ప్రస్తుత పీపీఏలు యథాతథంగా కొనసాగించాలని రాష్ట్ర విభజన చట్టం చెప్తున్నప్పటికీ.. ఏపీ ప్రభుత్వం జెన్‌కో ఈఆర్‌సీ అనుమతిలేదనిచెప్తూ కొన్ని పీపీఏలను రద్దు చేసి, ఉత్పత్తి షెడ్యూల్‌ను విడుదల చేయడమే మానేసింది. దీనికి తోడు పోలవరం బిల్లు ద్వారా తెలంగాణ ప్రాంతంలో ఉన్న సీలేరు ప్లాంటు కూడా ఏపీలో కలిసిపోయింది. దీనికి ప్రతిగా అన్నట్లు తెలంగాణ ప్రభుత్వం తొలుత నాగార్జునసాగర్ ఉత్పత్తి నుంచి ఏపీకి వాటా నిలిపేసింది. తరువాత జూరాల నుంచీ ఆపేసింది. ఈ వివాదాలపై కేంద్రం జోక్యం చేసుకున్నా సత్ఫలితాలివ్వలేదు సరికదా రోజురోజుకూ ఈ అగాధం పెరిగిపోతోంది. తెలంగాణకు 500 మెగావాట్లు అదనంగా ఇవ్వాల్సిన అవసరం ఉందని సీఈఏ తాజాగా సూచించింది. ఇరు రాష్ట్రాల అవసరాల కోణంలో పట్టువిడుపులతో తక్షణం పరిష్కరించుకోవాల్సిన అంశాల్లో ఇదీ ఒకటి.
 
 ఫీజుల గడబిడ!
 వృత్తి విద్యాకాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ వివాదం సుప్రీంకోర్టు తీర్పు పుణ్యాన ఓ కొలిక్కివచ్చి ఉమ్మడి కౌన్సెలింగ్ ఆరంభమైంది. కానీ కీలకమైన ఫీజుల గొడవ అలాగే ఉంది. 1956 కన్నా ముందు నుంచీ తెలంగాణలో ఉన్నవారికే ఫీజురీయింబర్స్‌మెంట్ ఇస్తామనీ, ఈ సాయానికి అర్హులెవరో ఎంచుకునే అధికారం తమకే ఉందనేది తెలంగాణ ప్రభుత్వ వాదన. కానీ తద్వారా తెలంగాణలో దశాబ్దాలుగా నివసిస్తున్న సీమాంధ్రుల పిల్లలకు నష్టం జరుగుతుందనీ, క్రమేపీ ఈ స్థానికత ప్రాతిపదికను ఇతర అన్ని అంశాలకూ వర్తింపజేసే ప్రమాదముందనీ ఏపీ ప్రభుత్వం సందేహిస్తోంది. కేంద్రానికీ ఫిర్యాదు చేసింది. ఈ ప్రాతిపదిక కేవలం ఫీజులకే పరిమితమనీ, సీట్లు – కొలువులకు సంబంధించి 371డి నిబంధనల్నే పాటిస్తామనీ తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది. ఈ ఫీజుల భారాన్ని కూడా 58:42 నిష్పత్తిలో పంచుకుందామని చంద్రబాబు ప్రకటించినా, టీ-సర్కారు సానుకూలంగా స్పందించలేదు. తమ దృక్కోణంలో అర్హులకు మాత్రమే 100 శాతం చెల్లిస్తామని చెప్పేసింది.
 
 ఆ 37 సంస్థల తకరారు!
 కొన్ని ప్రభుత్వ సంస్థల్ని 10వ షెడ్యూల్‌లో పేర్కొన్నా.. దాదాపు 37 సంస్థల్ని విభజన చట్టం ఏ షెడ్యూల్‌లోనూ పేర్కొనలేదు. భౌగోళిక ఉనికి ఆధారంగా తెలంగాణలో ఉన్నవి తమకే చెందుతాయనే వాదనతో టీ-సర్కారు ముందుగా ఎన్‌జీ రంగా వర్సిటీ పేరు మార్చేసి స్వాధీనం చేసుకుంది. దీనితోనూ ఏపీ ప్రభుత్వం విభేదిస్తోంది. వీటిపై ఏం చేయాలో తేల్చకుండా కేంద్రమూ నాన్చడమూ వివాదాలు పెరగడానికి కారణం. ఇవేగాకుండా రెండు ప్రభుత్వాలూ విడివిడిగా ఉన్నతాధికారులను నియమించడంతో నిథమ్, న్యాక్ వంటి సంస్థలూ వివాదాలకు కారణమవుతున్నాయి. ఇవేగాకుండా అసెంబ్లీ, సెక్రటేరియట్, ఎమ్మెల్యే క్వార్టర్ల పంపిణీ సరేసరి. ఒకే ప్రాంగణంలో అసెంబ్లీ, సెక్రటేరియట్ వ్యవహారాలు కష్టమనీ, ఏపీ ప్రభుత్వానికి విడిగా ఏర్పాట్లు చూడాలని టీ-సర్కారు వాదిస్తోంది. హెచ్‌ఓడీ కార్యాలయాల్లోనూ భవనాల కేటాయింపు ఇంకా కొలిక్కిరాలేదు. ప్రధానమైన హెచ్‌ఓడీలను విజయవాడకు తరలిస్తామని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
 
 గవర్నర్ అధికారాలపైనా..!
 ఉమ్మడి రాజధానిలో గవర్నర్‌కు విశేషాధికారాల్ని కల్పించాలనీ, ఈ మేరకు ప్రభుత్వ బిజినెస్ రూల్స్ సవరించాలని కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాస్తే.. విశేషాధికారాలు కల్పించాల్సిన అవసరం లేదనీ, చట్టం చెప్పిన పరిమితాధికారాల అప్పగింతకే అంగీకరిస్తామంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రం సూచనల అమలుకు ససేమిరా అంటోంది. ఈ ముసుగులో రాజధానిని రాష్ట్రపతి పాలన కిందకు తీసుకొస్తున్నారని వాదిస్తోంది. హైదరాబాద్‌లో నివసించే సీమాంధ్రుల భద్రతకు గవర్నర్ విశేషాధికారాలు ఉండాల్సిందేనని ఏపీ ప్రభుత్వ ముఖ్యుల వాదన.
 
 ఉద్యోగుల పంపిణీ…
 రాష్ట్ర స్థాయి పోస్టుల్లో ఉన్న ఉద్యోగుల పంపకంపై కసరత్తు చేస్తున్న కమలనాథన్ కమిటీ పూర్తిగా ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులు చెబుతున్నట్లే వ్యవహరిస్తోందనీ, ఆ దిశలోనే మార్గదర్శకాల్లో 18ఎఫ్ పేరా పొందుపర్చారనీ తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనిపైనా ఏకాభిప్రాయం ఇంకా రాలేదు.
 
 వాహనాలపై పన్ను…
 ఏపీ నుంచి వచ్చే వాహనాలపై పన్ను విధించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఇంకో వివాదం మొదలైంది. నిజానికి గతంలో గవర్నర్ దగ్గర జరిగిన ఉన్నత స్థాయి భేటీలో ఏప్రిల్ 2015 దాకా రెండు రాష్ట్రాల నడుమ పన్ను విధించాల్సిన అవసరం లేదని నిర్ణయం తీసుకున్నారనీ, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం దాన్ని ఉల్లంఘించి వాహన యజమానులందర్నీ ఇబ్బందుల్లోకి నెట్టేస్తోందనీ ఏపీ ప్రభుత్వ ముఖ్యులు విమర్శిస్తున్నారు.
 
 సాగునీటి కష్టాలు!
 వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రాజెక్టుల్లో ప్రస్తుత నీటిమట్టాలు మొత్తం ఆయకట్టుకు సరిపోయే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జునసాగర్ నీటివిడుదల రానురాను కొన్ని వివాదాలకు దారి తీసే ప్రమాదముంది. విభజన మొదట్లోనే తాగునీటి అవసరాల కోసం 10 టీఎంసీల కృష్ణా జలాలను విడుదల చేయాలని కృష్ణా బోర్డు నిర్ణయిస్తే.. వాటిని నారుమళ్లకు వాడేస్తారంటూ తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిం చింది. తరువాత బోర్డు జోక్యం చేసుకుని విడతల వారీగా నీటిని విడుదల చేయించింది. పోలవరం ముంపు ప్రాంతాల వివాదం అలాగే ఉంది. ముంపు మండలాల అప్పగింతకు టీ-సర్కారు ససేమిరా అంటోంది. ముంపు నివారణకు పోలవరం డిజైన్ మార్చాలంటూ, పోలవరంపై ఇతర పొరుగు రాష్ట్రాల్లాగే తెలంగాణ అభిప్రాయాలనూ, ఆందోళనలనూ పరిగణనలోకి తీసుకోవాలని వాదిస్తోంది. తుంగభద్రపై ఉన్న రాజోలిబండ డైవర్షన్ కెనాల్ ఎత్తు పెంపు వ్యవహారం కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల రైతుల మధ్య కొట్లాటగా మారి.. ఇదీ రెండు రాష్ట్ర ప్రభుత్వాల నడుమ వివాదంగా మారింది.