యుఎస్ ఓపెన్ దద్దరిల్లింది

images (3)యుఎస్ ఓపెన్ పెను సంచలనాలతో వూగిపోయింది! చరిత్ర లిఖిస్తూ, అభిమానులకు షాకిస్తూ పురుషుల సింగిల్స్‌లో జపాన్ వీరుడు నిషికోరి, క్రొయేషియా యువ ఆటగాడు మారిన్ సిలిక్ ఫైనల్లో ప్రవేశించారు. సెమీస్‌లో నిషికోరి టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్‌కు, సిలిక్ 17 గ్రాండ్‌స్లామ్ విజేత రోజర్ ఫెదరర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చారు.

సంచలన విజయాలను కొనసాగిస్తూ జపాన్ కుర్రాడు నిషికోరి ఫైనల్‌కు దూసుకెళ్లాడు అతడిని అనుసరిస్తూ సిలిక్ కూడా తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరుకున్నాడు. తొలి సెమీస్‌లో నిషికోరి 6-4, 1-6, 7-6 (7-4), 6-3తో ప్రపంచ నెం.1 జకోవిచ్‌ను కంగుతినిపించాడు. వరుసగా ఎనిమిదోసారి యుఎస్ ఓపెన్ సెమీస్ ఆడిన జకోవిచ్.. నిషికోరి జోరు ముందు నిలవలేకపోయాడు. మెరుపు బేస్‌లైన్ షాట్లు, శక్తివంతమైన రిటర్న్‌లతో నిషికోరి చెలరేగిపోయాడు. తొలి సెట్ ఆరంభంలోనే జకో సర్వీస్ బ్రేక్ చేసిన అతడు జోరు కొనసాగిస్తూ 6-4తో తొలి సెట్ కైవసం చేసుకున్నాడు. రెండో సెట్లో హవా జకోదే. తన ట్రేడ్‌మార్క్ ఫోర్‌హ్యాండ్ షాట్‌లు, ఏస్‌లతో విరుచుకుపడిన జకోవిచ్ 6-1తో సెట్‌ను గెలుచుకున్నాడు. నువ్వానేనా అన్నట్లుగా సాగిన మూడో సెట్ టైబ్రేక్‌కు దారితీసింది. కీలక సమయంలో ఒత్తిడికి గురైన జకోవిచ్ అనవసర తప్పిదాలు చేయడంతో నిషికోరి టైబ్రేక్‌లో 4-0తో ఆధిక్యంలో నిలిచాడు. తర్వాత జకోవిచ్ పుంజుకున్నా.. సెట్ నిషికోరి ఖాతాలోనే చేరింది. జపాన్ సంచలనం రెండు అద్భుతమైన రిటర్న్‌లతో 7-4తో సెట్ దక్కించుకున్నాడు. ఐదు సెట్ల పోరు తప్పేలా లేదనుకుంటున్న సమయంలో నిషికోరి మరోసారి అదరగొట్టాడు. నాలుగో సెట్ తొలి గేమ్‌లోనే నొవాక్ సర్వీస్ బ్రేక్ చేసిన అతడు.. ఆధిపత్యం కొనసాగించి 6-3తో సెట్‌ను కైవసం చేసుకున్నాడు.

Leave a Comment