రూ.3 వేలుంటే డ్రైవింగ్ లెసైన్స్

  • 61406416659_625x300 (1)అక్రమమార్గంలో లెసైన్స్‌లు
  •      అర్హత,అనుభవం లేని డ్రైవర్ల చేతుల్లో  వాహనాలు
  •      బోగస్ డ్రైవర్లపై  సీఎం కే సీఆర్ సీరియస్

సిటీబ్యూరో :  అనుభవం అవసరం లేదు. అర్హతలతో సంబంధం లేదు. కేవలం  రూ.3 వేలు ఉంటే చాలు. రోడ్డు నిబంధనలపై  అవగాహన కోసం  నిర్వహించే టెస్టు, ట్రాక్ లలో నిర్వహించే  నైపుణ్య పరీక్షలూ  అన్నింటిలోనూ నూటికి నూరు మార్కులు వచ్చేస్తాయి. నెల రోజుల్లో డ్రైవింగ్ లెసైన్స్ చేతికొచ్చేస్తుంది. దాంతో కార్లు, బైక్‌లు నడపొచ్చు. మరో  రూ.5 వేలు చెల్లిస్తే  ఏకంగా  బస్సులే నడపొచ్చు. డ్రైవర్‌గా అనుభవం, అర్హత వచ్చేసినట్లే.  

ప్రతి పనికీ  ఓ రేటు చొప్పున నిర్ణయించి ప్రభుత్వ  పౌరసేవలను అంగడి సరుకుల్లా  విక్రయించే రవాణాశాఖ పనితీరు ఇది. అక్రమార్జనే లక్ష్యంగా  విధి నిర్వహణను  పరమపద సోపాన ంగా చేసుకొని రూ.కోట్లు గడిస్తోన్న  ఆర్టీఏ అధికారుల  నిర్వాకానికి  రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. అనుభవం, అర్హత లేని  డ్రైవర్ల  చేతుల్లో  ప్రజల ప్రాణాలు గాల్లో దీపాలవుతున్నాయి. చిన్నారులు  రక్తపుముద్దలవుతున్నారు. ఎంతోమంది  తల్లిదండ్రులకు  గర్భశోకం  మిగులుతోంది.

మాసాయిపేట ఉదంతంలోనూ, అంతకుముందు  జరిగిన అనేక  బస్సు  ప్రమాదాల్లోనూ  డ్రైవర్ల  నిర్లక్ష్యమే  ప్రమాదాలకు కారణమనే వాస్తవం బట్టబయలవుతున్నా  రవాణా శాఖ  కళ్లు  తెరుచుకోవడం  లేదు. కింది నుంచి  పైస్థాయి వరకు,   మోటారు వాహన తనిఖీ  అధికారి  నుంచి  ప్రభుత్వంలోనూ ఉన్న పెద్దల  వరకు  వాటాల రూపంలో  చేరుతున్న  సొమ్ము అనేక పాపాలకు మూల కారణమవుతోంది. ఇలాంటి వ్యవస్థీకృత  దోపిడీ పర్వంలో బోగస్ డ్రైవర్‌లను  నియంత్రించాలని, ప్రమాదాలకు పాల్పడితే డ్రైవింగ్ లెసైన్సులు రద్దు చేయాలన్న  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు  ఏమేరకు అమలవుతాయోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
దళారులే  ఆయుధంగా….
 
నగర శివార్లలోని  ఒక  ఆర్టీఏ కార్యాలయంలో  4 రకాల  డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లు ఉంటాయి. అక్కడ రోజూ కనీసం  100 మందికి  డ్రైవింగ్ లెసైన్స్‌లు  లభిస్తాయి. కానీ  ట్రాక్‌లలో నిర్వహించే  డ్రైవింగ్ నైపుణ్య పరీక్షలకు పట్టుమని  పది మంది కూడా హాజరు కావడం లేదు. అక్కడ దళారులు తప్ప వాహనదారులు  కనిపించరు.  

ఒకవేళ  ఏ కొద్ది మందో  వాహనదారులు నేరుగా  పరీక్షలకు  హాజరయ్యేందుకు  వచ్చినా ఉన్నపళంగా ఫెయిల్ అయిపోతారు. అందుకు కారణం వాళ్లు దళారుల ద్వారా రాకపోవడమే. డ్రైవింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకోవడమే. అక్కడే కాదు. ఎక్కడైనా  ఇదే తంతు. లెర్నింగ్ లెసైన్స్‌లు మొదలుకొని  డ్రైవింగ్ లెసైన్స్‌ల వరకు, రవాణా వాహనాలను నడిపేందుకు కావాల్సిన బ్యాడ్జీల వరకు వ్యాపారంగా  కొనసాగుతోంది. సాధారణంగా   లెర్నింగ్ లెసైన్స్‌ల  ప్రక్రియతోనే  ఇది మొదలవుతుంది.

రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ రూల్స్, సైన్‌బోర్డులు వంటి  ప్రాథమిక అంశాల పట్ల వాహనదారుల పరిజ్ఞానాన్ని  పరీక్షించి  లెర్నింగ్ లెసైన్స్  అందజేసేందుకు  ప్రభుత్వం  విధించిన ఫీజు  60 రూపాయలు. రెండు రకాల వాహనాలకైతే రూ.90 చెల్లించాలి. ఈ  పరీక్షలో  మొత్తం  20 ప్రశ్నలు ఉంటాయి. 12 నిమిషాల వ్యవధిలో  కనీసం  10 ప్రశ్నలకు సరైన జవాబులు గుర్తించాలి. అలాంటి  లెర్నింగ్ లెసైన్స్‌లు ఎలాంటి టెస్టులు లేకుండా తీసుకోవాలంటే రూ. 1200 నుంచి రూ.1500 వరకు ఉంటుంది.

రవాణాశాఖ నిబంధనల ప్రకారం  లెర్నింగ్ లెసైన్స్  తీసుకున్న నెల నుంచి  6 నెలలలోపు  సదరు వ్యక్తి  సమగ్రమైన  డ్రైవింగ్ నేర్చుకొని  నగరంలోని  ఆర్టీఏ  డ్రైవింగ్ టెస్ట్  ట్రాక్‌లలో ఖచ్చితమైన నిబంధనలు పాటిస్తూ  వాహనాన్ని నడపాలి. శాశ్వత డ్రైవింగ్ లెసైన్స్ కోసం  ప్రభుత్వం విధించిన ఫీజు  రూ.650. కానీ పెద్దగా వాహనాన్ని నడపాల్సిన పనిలేకుండా, ఒకవేళ వాహనం నడుపుతూ  ఫెయిల్ అయినా సరే  డ్రైవింగ్ లెసైన్స్ రావాలంటే డిమాండ్‌ను బట్టి రూ.1500 నుంచి రూ.3000 వరకు చెల్లిస్తే చాలు.  
 
సీఎం ఆదేశాలతోనైనా చలనం వస్తుందా
 
డ్రైవింగ్ పట్ల  వాహనదారుల్లో కనీస పరిజ్ఞానాన్ని కూడా  అంచనా వేయకుండా  ఎడాపెడా  లెసైన్స్‌లు ఇచ్చేసి పెద్ద పెద్ద  రవాణా వాహనాలను అప్పగిస్తున్న  ఆర్టీఏ  అధికారులు  ఏ మాసాయిపేట దుర్ఘటన జరిగినప్పుడో, షిరిడీ  దగ్గర  బస్సు బోల్తాపడ్డప్పుడో  మొక్కుబడిగా దాడులు నిర్వహించి వందల  కొద్దీ  బస్సులను  స్వాధీనం చేసుకోవడం ఆనవాయితీగా మారింది. బోగస్ డ్రైవర్లను నియంత్రించాలన్న  ముఖ్యమంత్రి  ఆదేశాలను కొద్దిగా  మార్చి  బోగస్ డ్రైవింగ్ లెసైన్స్‌లకే  అవకాశం లేకుండా చేస్తే  తప్ప  ప్రజలకు సురక్షితమైన  ప్రయాణ సదుపాయం లభించదు.
 

Leave a Comment