విక్రమ్‌కు థ్యాంక్స్!

61407954101_625x300సినీ హీరో విక్రమ్‌కు థ్యాంక్స్ అంటోంది బాలీవుడ్ బ్యూటీ సలోనిలుత్రా. ఈ భామ విక్రమ్ సరసన నటించలేదు. ఆయనతో ఏ ఇతర వాణిజ్య ప్రకటనల్లోనూ పనిచేయలేదు. అయినా విక్రమ్‌కు థ్యాంక్స్ అంటుందేమిటబ్బా అనుకుంటున్నారా? ఈ ముంబయి ముద్దుగుమ్మ కథేంటో చూద్దాం. బాలీవుడ్ బ్యూటీస్ బోలెడేసి అందాలతో కోలీవుడ్‌లో సందడిచేయడం చూస్తున్నాం. అలా ఈ సుందరి కూడా శరభం చిత్రం ద్వారా తమిళ ప్రేక్షకులను అలరించింది. కథక్ నాట్యంలో నైపుణ్యం పొందిన ఈ సొగసుల చిన్నది థియేటర్ ఆర్టిస్టుగానూ అనుభవం పొందిందట. అలాంటి ఈ భామ తన సినీరంగ ప్రవేశం గురించి తెలుపుతూ ముంబయిలో ఒక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్‌తో కలసి పాటకు నర్తించనని చెప్పింది.
 
 అది తన జీవితంలో చాలా ముఖ్యమైన తరుణంగా పేర్కొంది. ఆ సమయంలో రణ్‌బీర్‌కపూర్ నీ దృష్టి సినిమాలపై సారించు అన్న మాటలు తనను చాలా ప్రభావితం చేశాయని చెప్పింది. అదేవిధంగా ప్రముఖ నిర్మాత సీవీ.కుమార్ నిర్మించిన శరభం చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమవడం భాగ్యంగా భావిస్తున్నానంది. చిత్ర దర్శకుడు అరుణ్‌కుమార్ తన పాత్రకు ప్రాణం పోసినట్లే తన నట జీవితానికి జీవం పోశారని పేర్కొంది. తాను తమిళ చిత్రాలు చూసింది తక్కువేనని అందులో బాగా ఆకట్టుకున్న చిత్రం అన్నియన్ అని చెప్పింది. శరభం చిత్రంలో తాను బాగా నటించానని పేరు తెచ్చుకోవడానికి కారణం విక్రమేనని అంది. అన్నియన్ చిత్రంలో ఆయన సెకన్‌లో ముఖ కవళికలును మార్చడం ఎంతగానో ఆశ్చర్యపరచిందన్నారు. అలాంటి విక్రమ్ నటన తమకు స్పూర్తినిచ్చిందని చెప్పింది.
 
 అందుకే విక్రమ్‌కు థ్యాంక్స్ చెప్పుకుంటున్నానని అంది. ఇక శరభం చిత్రంలో తనకు అత్యంత కష్టమైన చాలెంజ్‌గా నిలిచిన విషయం సిగరెట్ కాల్చడం అని పేర్కొంది. తనకు సిగరెట్ కాల్చే అలవాటు లేకపోవడంతో పలు చిత్రాల్లోనూ సిగరెట్ కాల్చే సన్నివేశాలను చూసి తనదైన బాణిలో అలా నటించానని చెప్పింది. తనకు చెన్నై, తమిళసినిమా బాగా నచ్చాయని, అందుకే ఇకపై ఇక్కడ మకాంపెట్టనున్నట్లు నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం పలు అవకాశాలు వస్తున్నాయన్ని శరభం చిత్రంలోని పాత్రలాంటివే కావడంతో తిరస్కరిస్తున్నట్లు చెప్పింది. నటనకు అవకాశం ఉండే వైవిధ్యభరిత పాత్రలు కోరుకుంటున్నానని సలోని లుత్రా అంటోంది.