స్నహితురాలితో సై

images (1)గ్రాండ్‌స్లామ్ టైటిల్.. ఎవరికైనా ప్రత్యేకమే! టెన్నిస్ క్రీడాకారుల అంతిమ లక్ష్యం ఇదే! అంత ముఖ్యమైన టోర్నీలో తమకెంతో ఇష్టమైన వ్యక్తితోనే తలపడాల్సి వస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు సెరెనా విలియమ్స్, కరోలిన్ వోజ్నియాకిల పరిస్థితి ఇలాగే ఉంది. కష్టకాలంలో ఒకరికొకరు అండగా నిలిచిన ఈ స్నేహితురాళ్లిద్దరూ.. ఆదివారం యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోబోతున్నారు.
యుఎస్ ఓపెన్లో ఆసక్తికర పోరాటానికి రంగం సిద్ధమైంది. మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నెంబర్‌వన్ సెరెనా విలియమ్స్ (అమెరికా) తన స్నేహితురాలు వోజ్నియాకి (డెన్మార్క్)తో తలపడనుంది. కెరీర్‌లో 18వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై కన్నేసిన సెరెనా సెమీఫైనల్లో 6-1, 6-3తో వరుస సెట్లలో ఎక్తరీనా మకరోవా (రష్యా)పై సునాయసంగా గెలిచింది.

పెంగ్ పోరాడినా…: మరో సెమీఫైనల్లో చైనా అమ్మాయి షుయ్ పెంగ్ అనారోగ్యం పాలై మ్యాచ్ నుంచి మధ్యలో నిష్క్రమించినా.. ఆమె పోరాటం ఆకట్టుకుంది. వోజ్నియాకి 7-6 (7-1), 4-3తో ఆధిక్యంలో ఉన్న దశలో పెంగ్ మ్యాచ్ నుంచి వైదొలిగింది. మ్యాచ్ ఆసాంతం మాజీ ప్రపంచ నెంబర్‌వన్‌కు పెంగ్ చెమటలు పట్టించింది. విపరీతమైన ఎండతో ఇబ్బందిపడినప్పటికీ.. పెంగ్ పోరాటం ఆపలేదు. తొలి సెట్ స్కోరు 6-6తో సమమై మ్యాచ్ టైబ్రేకర్‌కు మళ్లింది. ఐతే టైబ్రేకర్‌లో పెంగ్ తేలిపోయింది. రెండో సెట్ ఆరంభంలోనే ఎండ దెబ్బ తగలడంతో పెంగ్.. కోర్టులో వేగంగా కదల్లేకపోయింది. వైద్యులు పెంగ్‌ను పరీక్షించడానికి ప్రయత్నించినా నిరాకరించింది. ఐతే ఎనిమిదో గేమ్‌లో స్కోరు 4-3తో ఉన్నప్పుడు పెంగ్ మరింత ఇబ్బంది పడింది. సర్వీస్ కూడా చేయలేని స్థితిలో కోర్టులోనే కూలబడింది. వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో పెంగ్ మ్యాచ్ నుంచి నిష్క్రమించింది. ఆమెను వీల్‌ఛైర్‌లో బయటకు తీసుకెళ్లాల్సి వచ్చింది.                                                                                                                                                                                                                                                                              images (2)

కష్టకాలంలో ఒకరికొకరు..
వోజ్నియాకి, సెరెనా ఒకప్పుడు ఎవరికి ఎవరో! కానీ మూడేళ్ల ముందు వీళ్లిద్దరూ మంచి మిత్రులయ్యారు. 2011లో సెరెనా గాయాలతో బాధపడుతూ టెన్నిస్‌కు దూరమైన సమయంలో, శస్త్రచికిత్స చేయించుకున్నపుడు ఆమెకు వోజ్నియాకి తోడుగా నిలిచింది. అలా మొదలైన వీళ్ల స్నేహం.. తర్వాత బలపడింది. టోర్నీలు లేనపుడు.. వీళ్లిద్దరూ తరచుగా కలుస్తుంటారు. బీచ్‌లకు వెళ్లి ఆస్వాదిస్తుంటారు. ఎన్‌బీఎ మ్యాచ్‌లకు కూడా వెళ్తుంటారు. ఈ ఏడాది గోల్ఫ్ స్టార్ రోరీ మెకల్రాయ్‌తో వోజ్నియాకి ప్రేమబంధానికి తెరపడి.. ఇబ్బందుల్లో ఉన్న సమయంలో సెరెనా అమెకు అండగా నిలిచింది. వోజ్నియాకి మళ్లీ ఆటపై దృష్టిసారించి.. మునుపటి ఫామ్ అందుకోవడానికి తోడ్పడింది. తాజాగా యుఎస్ ఓపెన్‌లో ఎప్పట్లాగే సెరెనా ఫేవరెట్‌గా బరిలోకి దిగగా.. వోజ్నియాకి ఒకప్పటి జోరు అందుకోవాలన్న లక్ష్యంతో అడుగు పెట్టింది. అనేక మలుపులు తిరిగిన మహిళల పోరు.. చివరికి స్నేహితురాళ్లనే ప్రత్యర్థులుగా మార్చింది.
సెరెనా యుఎస్ ఓపెన్ గెలిస్తే 18వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో పాటు హ్యాట్రిక్ యుఎస్ ఓపెన్ ఆమె ఖాతాలో చేరుతుంది. వోజ్నియాకి గెలిస్తే.. ఆమెకిదే తొలి గ్రాండ్‌స్లామ్. వీళ్లిద్దరూ కెరీర్‌లో తొమ్మిదిసార్లు తలపడగా.. సెరెనానే ఎనిమిదిసార్లు నెగ్గడం విశేషం. మరి ఈసారి ఎవరిది పైచేయి అవుతుందో!

Leave a Comment